ఏపీలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తహశీల్దార్లకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ తరుణంలో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్ని జిల్లా కలెక్టర్ నుంచి మండల తహశీల్దార్లకు బదిలీ చేయాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్లపై పని ఒత్తిడిని తగ్గించడంలో రద్దు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడంలో ఈ మార్పు సహాయపడుతుందని ఆయన అన్నారు. మెరుగైన ఫలితాలు సాధిస్తామని కూడా మంత్రి పేర్కొన్నారు. గతంలో, నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్, నివాస ప్రాంతాలు వంటి ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉండేది.
ప్రస్తుతం అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయని సమాచారం అందితే, జిల్లా రిజిస్ట్రార్ దర్యాప్తు నిర్వహించి, వాటిని రద్దు చేయమని సబ్ రిజిస్ట్రార్‌కు తెలియజేస్తారు. ఈ విధానం వల్ల జాప్యం, వివాదాలు తలెత్తుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో, రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న తహశీల్దార్లకు నేరుగా ఇస్తున్నట్లు మంత్రి చెప్పారని సత్య ప్రసాద్ తెలిపారు.