Latest Weather News: తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవనాల ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై బలంగా ఉందని, అందుకే భారీ వర్షాలు కురవడం ఖాయమని చెబుతున్నారు.
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడుతుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులు, తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శని, ఆదివారాల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణి కారణంగా సముద్రం ఎగసిపడుతోంది కాబట్టి అసలు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విజయవాడతో పాటు పలు ప్రాంతాలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. గత వారం రోజులుగా ఆ ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడలో మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వార్తలతో ఆందోళన చెందుతోంది.
Related News
తెలంగాణలో అయితే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో కీలకాంశాలను వెల్లడించింది. శనివారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఆదివారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అందుకే ఈరోజు, రేపు ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు సోమ, మంగళవారాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.